Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Thursday, June 16, 2005

కుమారసంభవం 1-1 అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా

కాళిదాసమహాకవి రాసిన కుమారసంభవం తెలుగు ప్రతిపదార్థతాత్పర్యాలతో దొరికింది. సంస్కృతం కూడా నేర్చుకున్నట్లుంటుందని చదవడం మొదలుపెట్టాను (పదోక్లాసు, ఇంటర్లలో మార్కులకోసం సంస్కృతం తీస్కున్నా కనీసం మాట్లాడటమన్నా రావాలి కదా). కావ్యం కత్తిలా ఉంది. మొదటి కొన్ని శ్లోకాల్లో హిమాలయాల వర్ణన నిజంగా అద్భుతం. ఛందస్సు పాటిస్తూ చెప్పటం పక్కన పెడితే అసలాంటి ఆలోచనలు చేయటమే కవిత్వమేమో.

(పదోక్లాసు సంస్కృతంలో "కన్యావరణం" అనే పాఠం గుర్తుందా? సప్తర్షులు హిమవంతుడి దగ్గరకు వస్తారు. మరీ అవమానిస్తున్నాననుకోకపోతే అది కుమారసంభవంలోదే)

ఇంటరెస్ట్ ఉన్నవాళ్లకి పుస్తకం వివరాలు:
http://www.archive.org/download/KumaraSaombhavamu/KumaraSaombhavamu.djvu
Djvu plugin: http://www.lizardtech.com

పుస్తకాన్ని 1910 లో చెన్నైలో ముద్రించారు. వెల అప్పట్లో రెండు రూపాయలు.

అప్పుడప్పుడూ ఒక సంస్కృత శ్లోకాన్నీ, రచయితల తాత్పర్యాన్నీ వాడుక తెలుగులో ఇక్కడ రాద్దామనుకుంటున్నాను. మొదటి సర్గలో మొదటి పద్యం (1-1):

అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా
హిమాలయో నామ నగాధిరాజః
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య
స్థితః పృథివ్యా ఇవ మానదండః

ఉత్తరదిక్కులో "మంచుకు ఇల్లు" అనే పేరున్న ఒక కొండలరాజు, తూర్పు, పడమరల్లో సముద్రాల్లోకి విస్తరించి భూమికి ఒక కొలబద్దలా ఉన్నాడు.

పద్యవ్యాకరణం ప్రకారం కాకుండా, ఎవరన్నా అర్థం అడిగితే చెప్పేలాగా రాశాను. లేకపోతే హిందీ, ఇంగ్లీషు అనువాదం సినిమాల్లా తయారౌతుందేమోనని (తెలుగు Jurassic Park లోనేమో, "దానమ్మకి కోపం వచ్చింది" అని అంటారు ఒక డైనోసార్ని ఉద్దేశించి).

ఇక్కడ పూర్వాపరాలంటే ముందువెనకలు కావు. తూర్పు (పూర్వం, పూరబ్), పడమర(అపరం) లు.

ఇంకోటి, ఈ పుస్తకంలో మానదణ్డః (మానదండః), స఑ఞ్చరతాం (సంచరతాం), అఙ్కః (అంకః) - ఇలా ఉంది వాడుక. ఇప్పుడెవరూ అలా రాయటంలేదు కాబట్టి అవి మార్చి రాశాను.

హిమాలయాలు నిజంగా సముద్రాల్లోకి విస్తరించి ఉన్నాయా, హిమవంతుడు నిజానికి హిమాలయాల్లో ఉండే ఒక కిరాతరాజేమో, ఆయన కూతుర్ని అక్కడే ఉండే శివుడనే అతనికిచ్చి పెళ్లి చేశారేమో లాంటి ఊహల గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పటికి కవి వర్ణనని చూద్దాం. కాళిదాసు ఎంత "పైన్నుంచి" ఆలోచించాడో ఇక్కడ చూడొచ్చు. వరసగా ఉన్న హిమాలయాల్ని చూసి, భూమికి స్కేల్ లా ఉన్నాయనడం అసలుసిసలైన abstraction.

సంస్కృతపదాలేవైనా అర్థం కాకపోతే ఇక్కడ ఒక మంచి Dictionary ఉంది. ఈ లింక్ తర్వాత్తర్వాత మారుతుందేమో కానీ "Monier Williams" అని సెర్చ్ కొడితే ఏదో ఒక కాపీ దొరుకుతుంది.

0 Comments:

Post a Comment

<< Home