Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Sunday, August 28, 2005

కొత్త Project

Progress on this blog is going to be slow.
Please visit ఆంధ్రమహాభారతం.

Tuesday, August 23, 2005

కుమారసంభవం 1-24 తయా దుహిత్రా సుతరాం చకాసే

తయా దుహిత్రా సుతరాం చకాసే
స్ఫురత్ప్రభా మండలయా సవిత్రీ
విదూరభూమిర్నవమేఘశబ్దా
దుద్భిన్నయా రత్నశలాక యేవ

మెరిసే ప్రభామండలంతో జన్మించిన తన కూతురితో కూడి ఆ మేనాదేవి విదూరపర్వత ప్రాంతాన కొత్తమబ్బు ఉరుముకు పుట్టిన మణిమొలక లా ప్రకాశించింది.

కుమారసంభవం 1-23 ప్రసన్నదిక్ పాంసువివిక్తవాతం

ప్రసన్నదిక్ పాంసువివిక్తవాతం
శంఖస్వనానంతరపుష్పవృష్టి
శరీరిణాం స్థావరజంగమానాం
సుఖాయ తజ్జన్మదినం బభూవ

పార్వతి జన్మదినాన దిక్కులన్నీ నిర్మలమయాయి, గాలిలో దుమారం పోయింది, శంఖనాదాల తర్వాత పుష్పవృష్టి కురిసింది. ఆమె జన్మదినం చరాచరప్రాణులకు సుఖకారకమయింది.

Tuesday, August 16, 2005

కాకతీయ యుగము - రెండవ బేతరాజు (1075-1090) - మొదటి భాగం

రెండవ బేతరాజు(1075-1090)

తండ్రి ప్రోలరాజు లాగానే రెండవ బేతరాజు కూడా గొప్ప పరాక్రమశాలి. ఇతనివి రెండు మూడు శాసనాలు కనబడుతున్నాయి.

కాజీపేట దర్గా లోని మొదటి శాసనం లో ఈయన పరాక్రమాన్ని బాగా వర్ణించారు. ఇతడు పరభూపదవాగ్ని. చోళమాళవ మదేభ మృగారి, విక్రమచక్రి, చలమర్తిగండ, దారిద్ర్య విద్రామని అని ఆయనకు బిరుదులు ఉన్నాయి. హనుమకొండ లో తన పేరు మీద బేతేశ్వరునికి దేవాలయం కట్టించాడు. శివపురము అనే తీర్థాన్ని పెట్టించాడు.

రెండోది కూడా దర్గా శాసనమే. ఇది 1090 నాటిది. త్రిభువనమల్లదేవర రాజ్యకాలమున అతని పాదపద్మోపజీవియైన కాకతి బేతరసు ప్రమోద సంవత్సర కార్తీక బహుళ అమావాస్య నాటి సూర్యగ్రహణ పుణ్యకాలమున హనుమకొండ నైరృత భాగమున శివపురమును ప్రతిష్ఠించాడు. శ్రీపర్వత (శ్రీశైలం) మల్లికార్జున శిలామఠాధిపతియగు అళియ రామేశ్వర పండితుడను శైవాచార్యుణ్ణి యథావిధిగా సత్కరించి పాదప్రక్షాళన, హస్తోదక పూర్వకంగా ఒక గ్రామం దానం చేశాడు. ఆ గ్రామానికి చెందిన నిధి నిక్షేపాలు, పన్నులు వగైరా సమస్త ఆదాయ సాధనములు సర్వసమస్యంగా ఇచ్చివేశాడు.

1079 నాటి ఇతని హనుమకొండ శాసనం ఒకటి కనబడుతూంది. తాను కట్టించిన బేతేశ్వరాలయం లోని ప్రోలేశ్వర దేవునికి నందాదీపానికై నిత్యం పండ్రెండు మానికల నెయ్యి పోయడానికి వ్యవస్థ చేశాడు. సబ్బనెరాచి శెట్టి కూడా తన ఇల్లు, గానుగ ఇచ్చాడు.

1119 నాటి మాటూరు శాసనం దుర్గ్యాహ్యం గా ఉన్నా దానిలోని "గతాంధ్రవైభవం నిలిపిపాడిరి" అనే వాక్యాన్ని బట్టి (అప్పటికే ఒకసారి ఆంధ్రవైభవం గతాంధ్రవైభవమైపోయిందా?) రెండవబేతరాజు కాలం లో అతని రాజ్యం ఊగిసలాడే పరిస్థితులు ఏర్పడ్డాయనిపిస్తుంది.

రెండవ బేతనికి ఏర్పడిన సమస్య ఎలాంటిది? అది అతని మిత్రులు, సామ్రాజ్యాధికారులు అయిన పశ్చిమ చాళుక్యుల వల్ల కలిగింది. చాళుక్య మొదటి సోమేశ్వరుని తర్వాత అతని పెద్ద కుమారుడు రెండవ సోమేశ్వరుడు (1068 - 1076) అధిష్ఠించాడు. అతని తమ్ముడు, మహాపరాక్రమశాలి అయిన విక్రమాదిత్యునికి గిట్టలేదు. వారసత్వానికై అన్నదమ్ములు భయంకరం గా పోరాడారు. రెండవ సోమేశ్వరునికి కులోత్తుంగచోడుని సహాయం లభించినట్లుంది. ఏమైనా తుది విజయం విక్రమాదిత్యునికి లభించింది. సోమేశ్వరుడు కారాగారబద్ధుడయాడు. విక్రమాదిత్యుడు ఆరవ విక్రమాదిత్యునిగా 1076-1126 మధ్య యాభై సంవత్సరాలు నిరాఘాటం గా రాజ్యాన్నేలాడు.

-సశేషం-

కాకతీయ యుగము - మొదటి ప్రోలరాజు (1030-1075)

కాకతీయ యుగము - మొదటి ప్రోలరాజు (1030-1075)

మొదటి బేతరాజు కుమారుడైన ఇతడు తండ్రిని మించిన పరాక్రమశాలిగా, రాజనీతిజ్ఞునిగా కనిపిస్తాడు. ప్రోలరాజు పశ్చిమ చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరునికి (1042-1068) సమకాలికుడు.

సోమేశ్వరునికి ఆహవమల్ల, త్రైలోక్యమల్ల బిరుదులు ఉన్నాయి. ఈ చక్రవర్తి దండయాత్రల్లో ప్రోలరాజు ప్రముఖపాత్ర వహించి హనుమకొండ విషయాన్ని శాశ్వతపట్టాగా పొందాడు. పశ్చిమ చాళుక్యల దయాధర్మాల మీద హనుమకొండ రాజ్యాన్ని సంపాదించాడని అనుకోవడం పొరపాటు. అది అతని పరాక్రమార్జితమే. అయినా మహాబలవంతులైన చాళుక్యులను వినయగతిచేత సుముఖులను చేసుకోవడం మంచిదని భావించాడు. పశ్చిమ చాళుక్యులకూ ఇతని అవసరముంది. చోళులని ఓడించే ప్రయత్నంలో కాకతీయుల తోడ్పాటు వారికి కావాలి.

ప్రోలరాజు విజయాలు కొన్ని అతని కుమారుడు రెండవ బేతరాజు కాజీపేట శాసనం లో కనబడతాయి. ప్రోలరాజు నిర్వక్రీకృత చక్రకూట విషయుడు. భద్రంగ విద్రావణుడు. కొంకణ మండలాన్ని జయించి యశస్సు దిక్కులకు వ్యాపింపజేశాడు. కొడపర్తి దుగ్గ (ర్గ) రాజు కొడుకును జయించి అడవులకు పారద్రోలాడు. పురుకూటాధిపుడైన గొన్న అనేవాడిని యుద్ధంలో సంహరించాడు.

మొదటి బేతని సాహసకార్యాల లాగానే ప్రోలుని చర్యలను కూడా పశ్చిమ చాళుక్యుల దండయాత్రల్లో భాగంగా అర్థం చేసుకోవాలి.

బిల్హణుడు తన విక్రమాంకదేవ చరిత్ర లో ఆరవ విక్రమాదిత్యుడు రాజకుమారునిగా ఉన్న కాలం లో చేసిన వీరకృత్యాలను వర్ణించాడు. యవ్వనం లోనే ఇతడు తండ్రి ఆజ్ఞ ను పొంది చోళుల పైన విజయ యాత్ర సాగించాడు. మొదట కొంకణ మండలాన్ని సాధించి, కేరళ పాండ్య మండలాల మీదుగా గంగైకొండపురాన్ని, కాంచీనగరాన్నీ జయించి, వేంగి మీదుగా బస్తరు రాజ్యం లోని చక్రకూటనగరాన్ని సాధించాడు.

చాళుక్యుల మిత్రుడైన ప్రోలుడు కూడా ఈ విజయ పరంపర లో భాగం వహించినట్లు రెండవ బేతరాజు కాజీపేట శాసనం నిరూపిస్తూంది. చక్రకూట మండలం లో ఉన్న భద్రంగ, పురుకూట ప్రాంతాలని కూడా ప్రోలుడు జయించాడు. దుర్గరాజు కుమారుడు పాలించిన కొడపర్తి గ్రామం వరంగల్లు జిల్లా లో ఉంది.

ప్రోలుడు రణరంగం లోనే విస్తారం గా ఉన్నా తన రాజ్యక్షేమాన్ని మరవలేదు. కంచి ఏకామ్రనాథ దేవాలయం శాసనాన్నిబట్టీ, గణపతి దేవుని మోటుపల్లి శాసనాన్నిబట్టీ ప్రోలరాజు జగత్కేసరి సముద్రం అనే పెద్ద తటాకమును నిర్మించి వ్యవసాయానికి సౌకర్యం కలిగించినట్లు తెలుస్తూంది. ప్రోలరాజు కుమారుడు రెండవ బేతరాజు తండ్రికి పుణ్యంగా కేసరి సముద్రానికీ, సెట్టి సముద్రానికీ వరుణ ప్రతిష్ఠ చేసినట్లు హనుమకొండ శాసనం సూచిస్తూంది. ప్రోలుడు శివారాధకుడు. లకులీశ్వర ఆగమం లో గొప్ప ప్రవీణుడైన రామేశ్వర పండితుని శిష్యుడు. ఇంతేకాక దీనానాథ జనులకు నిరతాన్నదాత అని శాసనం చెబుతూంది. ప్రోలరాజు వైజనపల్లి అనే గ్రామాన్ని శివపురము అనే పేరుపెట్టి తన గురువైన రామేశ్వర పండితునికి అర్పించాడు.

దీనినిబట్టి ప్రారంభం నుంచి కాకతీయ వంశం లో శైవం ప్రతిష్ఠితమైందని తెలుస్తూంది.

Monday, August 15, 2005

కుమార సంభవం 1-22 సా భూధరాణా మధిపేన తస్యాం

సా భూధరాణా మధిపేన తస్యాం
సమాధిమత్యా ముదపాది భవ్యా
సమ్యక్రయోగా దపరిక్షతాయాం
నీతావి వోత్సాహగుణేన సంపత్

నియమం గలదైన మేనాదేవి యందు హిమవంతునికి - చెడని నీతితో ప్రయోగించిన ఉత్సాహం వల్ల సంపద ఎలా పుడుతుందో అలా - సతీదేవి జన్మించింది.

కుమారసంభవం 1-21 అథావమానేన పితుః ప్రయుక్తా

అ థావమానేన పితుః ప్రయుక్తా
దక్షస్య కన్యా భవ పూర్వపత్నీ
సతీ సతీ యోగ విసృష్టదేహా
తా జన్మనే శైలవధూం ప్రపేదే

తండ్రి అవమానం చేత ప్రేరితురాలైన సతీదేవి యోగమార్గాన తన దేహాన్ని త్యజించి మళ్లీ జన్మించటానికై మేనాదేవిని చేరింది.

Saturday, August 13, 2005

కాకతీయ యుగము - మొదటి బేతరాజు (994-1030)

కాకతీయ యుగము - మొదటి బేతరాజు (994-1030)

మొదటి బేతరాజు నే కాకతీయ వంశప్రారంభకునిగా చరిత్రకారులు గుర్తిస్తున్నారు. మేనత్త అయిన కుంతలదేవి - కామసాని రాజ్యప్రతినిధిత్వం లో బాల్యం గడిపి 994 ప్రాంతాల్లో రాజ్యాధికారం స్వీకరించి ఉంటాడు.

ఈయన వేయించిన శాసనాలేవీ బయటపడలేదు కానీ ఇతని మనవడు రెండవ బేతరాజు ప్రకటించిన శాసనాల్లో మొదటి బేతరాజు ఘనత వర్ణించారు. సామంత విష్టివశుడు, కాకతి పురాధినాథుడు అయిన బేతరాజు చోడ క్ష్మాపాల సైన్యసముద్రాన్ని మధించి వీరలక్ష్మి ని పొందాడని రాశారు.

పరిమిత శక్తి గల బేతరాజు చోడ సైన్యసముద్రాన్ని ఎలా మధించాడు? ఇతడు స్వయంగా ఈ మహాకార్యం చేయలేదు. మిత్రులైన పశ్చిమ చాళుక్యుల పక్షం వహించి చోళులను నిర్జించాడు.

పశ్చిమాన కళ్యాణి లో రెండవ చాళుక్య సామ్రాజ్యం స్థాపించిన రెండవ తైలపుడు 997 లో మరణించగా అతని కుమారుడు సత్యాశ్రయుడు (997-1008) సింహాసనం అధిష్ఠించాడు.

ఇప్పుడు చోళ సామ్రాజ్యాన్ని మహాబలశాలి అయిన రాజరాజ చోళుడు ఏలుతున్నాడు. చోళులకు చాళుక్యులకు ఎడతెగని వైరం.

సత్యాశ్రయుడు కొత్తగా రాజ్యానికి వచ్చిన అదను చూసుకొని రాజరాజచోళుడు రట్టిపాడి పై దాడి చేసి చాలా నష్టం కలిగించాడు. సత్యాశ్రయుడు క్రమంగా బలం కూడదీసుకొని చోళులని వెనుకకు తరిమివేశాడు.

అంతేగాక వారి రెండవ రాజధాని అయిన కాంచీపురాన్ని చాళుక్యులు ఆక్రమించారు.

ఈ దాడులలో కాకతి మొదటి బేతరాజు చాళుక్యుల పక్షాన ఉండి వీరవిహారం చేశాడని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంచీపుర విజయంలో బేతని సేనాపతి బమ్మ (బ్రహ్మ) సేనాని గొప్పగా విజృంభించినట్లు తెలుస్తూంది.

కాకతి గణపతిదేవుని రాజ్యాన్ని రక్షించిన రేచెర్ల రుద్రసేనాని వేయించిన పాలంపేట శాసనంలో (క్రీ. శ. 1213) బమ్మసేనాని ప్రశస్తిని వర్ణించారు. "తూర్పునాదములు చెలరేగగానే యవనికాసదృశమైన కాంచీపుర కవాటాన్ని తొలగించి బమ్మసేనాని కాకతివల్లభునకు వీరలక్ష్మీ వివాహం నిర్వహించాడు".

బమ్మసేనాని పరాక్రమాన్ని పిల్లలమర్రి శాసనంలో కూడా ప్రశంసించారు. దీనిని బమ్మసేనాని వంశీయుడైన నామసేనాని వేయించాడు. "ప్రచండాహవమునందు బమ్మసేనాని కాంచీనగర కవాటహరణము కావించి చోళనరాధిపుని అభిమాన ద్రుమమును ఉన్మూలించాడు".

అయితే ఈ విజయాన్ని కొందరు బేతని కుమారుడు మొదటి ప్రోలరాజు కు ఆరోపిస్తున్నారు. ఇది ఒక విధంగా నిజమైనా కావచ్చు.

రాజరాజచోళుడు, ఆతని కుమారుడు రాజేంద్రచోళుడు అవక్రపరాక్రములు. వారి కాలం లో పశ్చిమ చాళుక్యులకు గాని వారి సామంతులు కాకతీయులకు గాని చోళసామ్రాజ్యం మీద విరుచుకుపడే అవకాశం వచ్చి ఉండదు.

ఈ సన్నివేశం పశ్చిమ చాళుక్య రెండవ జయసింహుని (1015-1042) రాజ్యాంతకాలం లో జరిగేందుకు అవకాశముంది. అది మొదటి ప్రోలుని రాజ్యారంభకాలం అవుతూంది. యువకుడైన ప్రోలుడు కూడా బమ్మ సేనాని తో పాటు తండ్రి అయిన మొదటి బేతరాజు కు సాయపడి ఉండవచ్చు.

ఇదే కాలం లో తూర్పు చాళుక్యుడైన మొదటి శక్తివర్మ రాజరాజచోళుని సహాయం తో వేంగి రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు.

బేత, ప్రోల రాజులు తెలుగు వారే. శక్తివర్మ, విమలాదిత్యుడు, రాజరాజ నరేంద్రుడు - వీరూ తెలుగు వారే. కానీ వీరు కలిసినట్లు కనిపించదు. వారి వారి మిత్రులు వేరవటమే దీనికి కారణం.

తమ తమ నెలవులు దప్పిన, తమ మిత్రులు శత్రులగుట తథ్యము సుమతీ! అని బద్దెన చెప్పింది నిజమే అనిపిస్తుంది.

కాకతీయ యుగము - విరియాల కామసాని

కుంతలదేవి - కామసాని ప్రతిభాసామర్థ్యాలు అర్థం కావాలంటే కాకతీయ సామ్రాజ్య ప్రారంభావస్థ లో దేశ పరిస్థితుల్ని గమనించాలి.
అది క్రీ. శ. 970 - 1000 మధ్య కాలం.
హనుమకొండ కు పశ్చిమాన ఉన్న రాష్ట్రకూట సామ్రాజ్యం 973 లో విచ్ఛిన్నమైంది.
పూర్వపు చాళుక్యులే తిరిగి బలం సంపాదించుకుని తైలపదేవుడి నాయకత్వం లో కళ్యాణి ముఖ్య పట్టణం గా రెండవ చాళుక్య సామ్రాజ్యం స్థాపించారు. వీరే కళ్యాణి చాళుక్యులు.

ఇటు తూర్పు చాళుక్యల లో కూడా విప్లవం బయలుదేరింది.
రెండవ అమ్మరాజు సవతి అన్న అయిన దానార్ణవుడు 970 లో పాలన ఆరంభించాడు. ఇంకో మూడేళ్లలోనే, 973 ప్రాంతం లో, తెలుగు చోడుడైన జటా చోడ భీముడు దానార్ణవుడిని యుద్ధం లో సంహరించి వేంగీ చాళుక్య రాజ్యాన్ని ఆక్రమించాడు.

దక్షిణాన చోళ సామ్రాజ్యం ఉంది కానీ అంత ప్రబలం గా లేదు.

ఇలాంటి సంధికాలం లో ఉపాయశాలి ఐన కాకర్త్య గుండ్యన చిన్న రాజ్యం స్థాపించుకున్నాడు కానీ అది బలపడే లోపు మరణించాడు. శైశవావస్థ లో ఉన్న కాకతీయ రాజ్యానికి ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదం బహుశా ముదిగొండ చాళుక్యులు అనే వారి నుంచి వచ్చి ఉంటుంది. వీరు తూర్పు చాళుక్యులకు మిత్రులు, సామంతులు అయినట్లు మొదటి చాళుక్య భీముని (892 - 921) కొరవి శాసనం చెబుతూంది. ఇది వరంగలు జిల్లా మానుకోట తాలూకా లో ఉంది. కొత్తగా ఏర్పడిన కాకతీయ రాజ్యం కొరవి సీమ లోకి వ్యాపించడానికి ప్రయత్నం చేసినపుడు సహజం గానే వీరు నిరోధించి ఉంటారు. విరియాల ఎర్ర భూపతి సంహరించినట్లు గూడూరు శాసనం ప్రకటిస్తున్న "ఉద్ధతవైరి" బహుశా ముదిగొండ చాళుక్య రాజై ఉంటాడు.

అంతటితో కాకతీయుల కష్టాలు తీరలేదు. బలవంతుల సహాయం కావలసి వచ్చింది. ఆ సమస్య నే కామసాని పరిష్కారం చేసింది. తూర్పు చాళుక్య రాజ్యం కూడా విప్లవానికి గురి అవడం చేత అటు నుండి సహాయం లభించదని ఆమె గ్రహించింది. వేగి రాజ్యం కన్నా బలవత్తరమైన కళ్యాణి చాళుక్య సామ్రాజ్యం పశ్చిమాన పరవళ్లు తొక్కుతూంది. వారి సాయం లభిస్తే కాకతీయ రాజ్యం స్థిరపడుతుందని గ్రహించి ఆ ప్రయత్నం చేసి కృతకృత్యురాలైంది. కాకతి నిల్పడం అంటే ఇదే.

శైశవావస్థ లో ఉన్న కాకతీయ రాజ్యానికి మహాబలశాలులైన మిత్రులు దొరికారు. అప్పటి నుండి ఒక శతాబ్దం పైగా కామసాని రాజనీతే కాకతీయుల విదేశాంగ నీతి అయింది. కాకర్త్య గుండ్యన కాలం 950-975 అని చిలుకూరి వీరభద్రరావు పంతులు గారు గ్రహించారు కాబట్టి కుంతలదేవి - కామసాని 19 సంవత్సరాలు రీజెంటు గా ఉన్నట్లయితే మొదటి బేతరాజు 994 ప్రాంతం లో పాలన ఆరంభించి ఉంటాడు. ఇతడు 1030 వరకూ రాజ్యం చేశాడని చరిత్రకారులు భావిస్తున్నారు.

Friday, August 12, 2005

కాకతీయ యుగము - కాకర్త్య గుండ్యన

కాకతీయ యుగము - కాకర్త్య గుండ్యన

ఇతన్ని గురించి తెలిసినా,ఇతనికీ మొదటి బేతరాజు కూ గల సంబంధం గురించి చరిత్రకారులు సందేహిస్తున్నారు. ఈ సందర్భం లో మనకు ప్రతాపచరిత్ర, సిద్ధేశ్వరచరిత్ర వంటివి తోడ్పడినా వీటిలో నిజమైన చరిత్ర, పుక్కిటి పురాణాలూ కలగాపులగం గా ఉండడం వల్ల ఇంకా సంశయం కలుగుతూంది.అయితే వాటిలో చెప్పినవన్నీ కొట్టిపారేయనక్కర్లేదు.

ఈ పూర్వ వృత్తాంతాలని బట్టి కాకతీయ చరిత్ర ఇలా ఉంటుంది:

మన అత్యంత ప్రాచీన రాజవంశాల్లో ఆనందగోత్రీకులు ఒకరు. వీరు కందరపురాధిపతులు. పల్లవుల తో జరిగిన ఒక యుద్ధం లో ఈ వంశీయుడైన సోమదేవరాజు మరణించగా ఆయన రాణి సిరియాలదేవి హనుమకొండ వచ్చి తలదాచుకుంది. ఆమె కుమారుడు మాధవవర్మ పెద్దవాడైన తర్వాత హనుమకొండ రాజ్యం ఆక్రమించుకున్నాడు. పద్మాక్షి దేవి ఇతని వంశం హనుమకొండలో వెయ్యేళ్లు వర్ధిల్లుతుందని వరమిచ్చింది. ఆనందగోత్రీకులు క్రీ. శ. 4వ శతాబ్దం మొదట్లో కృష్ణాతీరాన్ని పాలించినవారు. ఓరుగల్లు పతనము క్రీ. శ. 1323 లో. మధ్యలో వెయ్యేళ్లు ఉన్నాయి. ఇది అద్భుత కథనం గా తోస్తుంది.

మాధవవర్మ తర్వాత గుర్తించడానికి వీలు లేని కొందరు రాజులు హనుమకొండ సింహాసనాన్ని అధిష్ఠించారు.

వీరిలో పెండ్లి గుండమరాజు ఒకడు. ఇతడే కాకర్త్య గుండ్యన అయ్యుండవచ్చు. గుండ్యన తూర్పు చాళుక్యుల వద్ద ఉన్నతోద్యోగి అని మాగల్లు శాసనం వల్ల తెలుస్తోంది. అతడే పెళ్లి సంబంధం ద్వారా హనుమకొండ రాజ్యానికి వారసుడయ్యాడని ఊహించవచ్చు.

ఇతనికి కుంతలదేవి అనే సోదరి ఉంది. ఆమెను విరియాల వంశం లో పెళ్లి చేసి గుండ్యన తన స్థానాన్ని కొంత బలపరచుకున్నాడు.

విరియాల వారి వృత్తాంతాన్ని 1000 ప్రాంతం లో వెలసిన గూడూరు శాసనం లో చక్కగా వర్ణించారు. వీరిలో వెన్న, ఎర్ర, భీమ అనే ప్రసిద్ధవీరుల తర్వాత మరొక ఎర్ర నరేంద్రుడు జన్మించాడు. ఇతడు పరాక్రమశాలి. ఈయన భార్య కామమసాని వీరవనిత, రాజనీతిజ్ఞురాలు.

గుండ్యన సోదరి కుంతలదేవినే మనం విరియాల కామమసానిగా గుర్తిస్తున్నాము. ఈ సమీకరణం ఇలా కుదురుతూంది:

సిద్ధేశ్వర చరిత్ర ప్రకారం: గుండమరాజు కొడుకైన ఎరుగదేవరాజు బాలుడు కావడం వల్ల కుంతలదేవి రాజ్యసంరక్షకురాలిగా పందొమ్మిదేండ్లు రాజ్యభారం వహించింది.

గూడూరు శాసనం ప్రకారం: విరియాల రెండవ ఎర్రనరేంద్రుడు పిల్లవాడైన బేతరాజు పక్షం వహించి అతని శత్రువులను యుద్ధం లో సంహరించాడు. ఆయన భార్య కామసాని తన భర్త ఆరంభించిన సదుద్యమాన్ని సమర్థత తో నిర్వహించింది. బేతరాజు ను కాకతి వల్లభుని చేసి కాకతీయ రాజ్యం నిలబెట్టింది. ఇలా చేయడం - కాకతినిల్పుట కోటిసేయదే - అని శాసనకారుడు కామసానిని ప్రశంసించాడు. నిజమే. అది అలాంటిదే.

పై రెండు ఆధారాలూ సమీకరించి ఇలా చెప్పగలుగుతున్నాము:

కాకర్త్య గుండ్యన 970 ప్రాంతాలలో హనుమకొండ రాజకుటుంబం తో సంబంధం చేసుకొని రాజ్యలాభం పొందాడు.
స్థానం స్థిరపరచుకొనే లోపే మరణించాడు.
అతని కుమారుడు చిన్నవాడు. అతడే పొట్టిబేతడు. చరిత్రకు తెలిసిన మొదటి బేతరాజు ఇతడే.
తండ్రి మరణసమయానికి ఇతడు చిన్నవాడవటం వల్ల కాకతీయ రాజ్యం ప్రమాదం లో పడింది.
ఈ స్థితి లో కాకతీయులకు బంధువులు, సామంతులు అయిన విరియాల వారు రాజ్యాన్ని కాపాడి బేతడికి అప్పగించారు.

ఇది నిజంగా గొప్ప విషయం. అందరిలాగానే విరియాల వారు కూడా రాజ్యాన్ని అపహరించే ప్రయత్నం చేసి ఉంటే కాకతీయ సామ్రాజ్యం పురుటిలోనే అదృశ్యమయేది. కాకతీయులు సామంతుల విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పాలి. గణపతిదేవుడి బాల్యం లోనూ ఇలాంటి సన్నివేశమే జరిగింది. యాదవులతో యుద్ధంలో మహదేవరాజు మరణించాడు. గణపతిదేవుడు చెరపట్టబడ్డాడు. కాకతీయ రాజ్యం చుక్కాని లేని పడవలా తయారైంది. శత్రువర్గం తిరుగుబాట్లు లేవదీస్తోంది. ఈ విపత్కర సమయం లో స్వామిభక్తి పరాయణుడైన రేచెర్ల రుద్రసేనాని రాజ్యాన్ని ఆదుకొని, శత్రువులను చెండాడి, సామ్రాజ్యాన్ని నిలబెట్టి గణపతిదేవుడికి అప్పగించాడు.

విరియాల రెండవ ఎర్ర నరేంద్రుడు, అతని భార్య కామసాని సరిగ్గా ఇదే పని రేచెర్ల రుద్రుడికి రెండు శతాబ్దాల పూర్వం చేశారు.

Thursday, August 11, 2005

కాకతీయ యుగము - వంశనామము - వంశోత్పత్తి

కాకతీయ యుగము - వంశనామము - వంశోత్పత్తి

కాకతీయుల వంశనామము కాకిత, కాకెత, కాకర్త్య, కాకతి రూపాల్లో కనబడుతుంది. కాకతి అనే ఊరుపేరునుబట్టికాని, కాకతి అనే దేవతనుబట్టికాని ఆ పేరు వచ్చి ఉండవచ్చు.

విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథానికి వ్యాఖ్యానం చేసిన కుమారస్వామి సోమపీఠి, కాకతి అనే దేవతను ఆరాధించడం వల్ల వారు కాకతీయులు అయినట్లు వివరించాడు.

క్రీడాభిరామం లో 'కాకతమ్మకు సైదోడు ఏకవీర' అని వర్ణించారు. హనుమకొండ దుర్గం లోని కొండ మీది పద్మాక్షి దేవి కాకతమ్మ అయి ఉండవచ్చా లేక ఆమెకు ఓరుగల్లు లో వేరే ఆలయం ఉండేదా అన్నది తెలియదు.

రాజమండ్రి రెడ్డిరాజ్యాన్ని పాలించిన వీరభద్రారెడ్డి భార్య అనితల్లి వేయించిన కలువచేరు శాసనం లో కాకతీయులు గుమ్మడి తీగకు పుట్టినట్లు రాశారు. వంశానికి మూలపురుషుడైన మాధవవర్మ కుమారుడు పద్మసేనుడికి సంతానం లేక, హనుమకొండ పద్మాక్షి ని గుమ్మడికాయల తో పూజిస్తే కొడుకు పుట్టాడని సిద్ధేశ్వర చరిత్రలో కనబడుతుంది. ఆ వృత్తాంతమే కలువచేరు శాసనం లో కథగా పరిణమించింది.

ఇవన్నీ చూస్తే కాకతి అనే దేవత నుండి వంశనామాన్ని సృష్టించడం తర్వాతెప్పుడో జరిగినట్లనిపిస్తుంది. కాకిత లేక కాకతి అనే గ్రామం వల్ల వీరు కాకతీయులయారనడం ఎక్కువ విశ్వసనీయం గా ఉంది.

రెండవ బేతరాజు (1075-1111) తన కాజీపేట శాసనం లో తన తాత అయిన మొదటి బేతరాజు గురించి "సామంతవిష్టివశః (వంశ్యః కావచ్చు) శ్రీమాన్ కాకతి పురాధినాథోబేతః" అని రాయించాడు. ఈ మొదటి బేతరాజే కాకతీయ వంశానికి మూలపురుషుడని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇతడు సామంతవిష్టి వంశం వాడనీ, కాకతి పురాధినాథుడనీ చెప్పడం గమనించదగింది.

హనుమకొండకీ, ఓరుగల్లుకీ కాకతిపురం అనే పేరు ప్రచురంగా లేదు. అదొక గ్రామమై ఉండవచ్చు.

చోళులు తామెక్కడున్నా, ఎంత చిన్న కుటుంబమైనా "ఒరయూరు పురవరాధీశ్వర" అని రాయించుకుంటుంటారు.
రేచెర్ల పద్మనాయకులు "ఆమనగంటి పురవరాధీశ్వర" అని రాయించుకుంటుంటారు.
అలాంటిదే ఈ కాకతిపురం కూడా అనుకోవాలి. కాకతి, కాకెత అనే పేరుగల గ్రామాలు చాలా ఉన్నాయి. వాటిలో వీరిది ఏదో చెప్పడం కష్టమైనా ప్రయత్నించవచ్చు.

మొదటి బేతరాజు కు ముందే కాకర్త్య గుండ్యన అనే పేరు వినవస్తూంది. ఇతను తూర్పు చాళుక్యుడైన రెండవ అమ్మరాజు (945-970) కాలం వాడు. అమ్మరాజు వేయించిన మాగల్లు శాసనం లో కనబడుతున్నాడు. కాకర్త్య గుండ్యన ప్రార్థన మీద రెండవ అమ్మరాజో, ఆయన సవతి అన్న దానార్ణవుడో ఒక బ్రాహ్మణుడికి భూదానం చేసినట్లు ఈ శాసనం చెబుతుంది. గాలి నరసయ్య కాస్తా వాతూల అహోబలపతి అయినట్లు కాకతి గుండయ కాకర్త్య గుండ్యన అనే పేరుతో కనబడినా ఆశ్చర్యం లేదు.

ఇతని తండ్రితాతలకు రాష్ట్రకూట బిరుదముంది. ఇతనిది సామంత ఒడ్డె వంశము. ఒడ్డె అనేది ఓఢ్ర (Orissa) శబ్దభవం. విశాఖపట్నం జిల్లాలోని వడ్డాది ముఖ్యపట్నంగాగల ప్రాంతం వడ్డెనాడు, ఒడ్డెనాడు కావచ్చు. వడ్డాదికి సమీపం లో కాకతి అనే గ్రామం ఉందని చిలుకూరు వీరభద్రరావు పంతులు గారు గుర్తించారు.

ఈ విషయాలన్నీ సమన్వయం చేస్తూ కాకర్త్య గుండ్యన పూర్వులు ఒడ్డెనాడు కు చెందినవారనీ, అతని తండ్రితాతలో, లేక అతడో గోదావరి దాటివచ్చి తూర్పు చాళుక్యుల వద్ద ఉద్యోగులుగా కుదురుకున్నారనీ చెప్పవచ్చు.

Wednesday, August 10, 2005

కాకతీయ యుగము (గురించి ఎందుకు తెలుసుకోవాలి?)

తెలుగువారూ కాకతీయులగురించి వినే ఉంటారు. లక్ష్మీరంజనం గారైతే "ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రముఖస్థానం గల కాకతీయ వంశము వారి యశోగానం చెయ్యడం మనవిధి" అన్నారు, మనమసలు ముందు వారి గురించి కొంచెం తెలుసుకుందాం.

కాకతీయుల గురించి ఎందుకు తెలుసుకోవాలి?
-----------------
1) కాకతీయులు తెలుగుదేశాన్ని సుమారు 325 సంవత్సరాలు (1000 AD - 1323 AD) పరిపాలించారు.

2) 225 BC - 225 AD మధ్యలో తెలుగుదేశాన్నే గాక దక్షిణాపథంలో విస్తారమైన భాగాన్ని పాలించిన శాతవాహనులకన్నా, 625 AD -1075 AD మధ్యలో వేంగీదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్యులకన్నా కాకతీయులు మనకు బాగా సన్నిహితులు.

శాతవాహనుల గురించి మనకు తెలిసింది తక్కువైతే తూర్పుచాళుక్యులు ముఖ్యంగా మన సముద్ర తీర ప్రాంతాన్ని ఏలినవారు. తూర్పు చాళుక్యులు గురించి నన్నయ వల్ల, ఆయన్ని ప్రేరేపించిన రాజరాజ నరేంద్రుడనే మహారాజు వల్ల మన గ్రామాల్లో కూడా కొంత తెలుసు.

3) శాతవాహనులు తాము ఆంధ్రులమని ప్రత్యేకంగా చెప్పుకోలేదు. పురాణాలు వీరిని ఆంధ్రవంశీయులన్నాయి కాబట్టి వీరు ఆంధ్రులని మనకు ధ్రువపడుతోంది. నన్నయకూడా వేగీదేశమనే వర్ణించాడు. ఆంధ్రశబ్దం లేదని కాదు. నిజానికి మూలంలో లేకపోయినా ఆంధ్రమహాభారతంలో తెలుగుదేశ ప్రసక్తిని తెచ్చి (దక్షిణగంగనా) నన్నయ తన మాతృదేశ భక్తిని ప్రదర్శించాడు.

కాకతీయుల కాలానికి ఆంధ్రదేశ భావన బాగా స్థిరపడినట్లుంది. ఈ కాలానికే చెందిన తిక్కన సోమయాజి తన మహాభారత పీఠికలో "ఆంధ్రావళి మోదముబొరయ" అని రాశాడు. ప్రతాపరుద్ర చక్రవర్తిని గురించి క్రీడాభిరామం లో "ఆంధ్రోర్వీశు మోసాలపై" అని వర్ణించారు.

తూర్పుచాళుక్యుల అధికారం సమగ్రాంధ్రంపై చెల్లలేదు. వీరికాలంలో పశ్చిమాంధ్రం వాతాపి చాళుక్యులు, రాష్ట్ర్రకూటులు, కళ్యాణి చాళుక్యుల అధీనంలో ఉండిపోతూ వచ్చింది. ఈ కారణంవల్ల శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్నంతటినీ పాలించిన రాజకుటుంబాలలో కాకతీయుల్నే ముందు చెప్పాలి.

4) కాకతీయులకీ, వారి సామంతులకీ సంబంధించిన శాసనాలు తెలంగాణాలో ఇప్పటికీ చాలా దొరుకుతున్నాయి. హనుమకొండ, పాలంపేట, పిల్లలమర్రిలో వారికాలంలో నిర్మించిన గొప్ప దేవాలయాలు శిథిలావస్థలోనైనా నిలిచి ఉన్నాయి. వారు తవ్వించిన పాకాలచెరువు, లక్నవరం చెరువు, ధర్మసాగరం వంటివాటివల్ల తెలంగాణకి కాసారములనాడు అని ప్రసిద్ధివచ్చిందట. వారిచ్చిన అగ్రహారాల గురించీ, భూవసతుల గురించీ శాసనాల ద్వారా విస్తారంగా తెలుస్తున్నాయి.

5) కాకతీయులనాటి వాఙ్మయంకూడా బాగా లభిస్తూంది. వాటిలో కొన్ని:

విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణము
మార్కండేయ పురాణము
శివయోగసారము
క్రీడాభిరామము
ఏకామ్రనాథుని ప్రతాప చరిత్ర
కానెసర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర
మార్కో పోలో, ఇబ్న్ బటూటా ల యాత్రావిశేషాలు
కాకతీయుల సామంతులైన నెల్లూరి చోడుల ఆస్థానానికి చెందిన తిక్కన సోమయాజి రచించిన నిర్వచనోత్తర రామాయణం
ముస్లిం చరిత్రకారులైన ఈసామీ, బర్నీ, ఖుస్రూ, ఫెరిస్తా మొదలైనవారి రచనలు.

6) కాకతీయవంశీయులైన గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇప్పటికీ అందరికీ గుర్తున్నారు.

7) ఆనాటి తెలుగు కూడా కొంత సుగమం గానే ఉంటుంది.

శాతవాహనుల కాలం లో తెలుగు భాష ఉనికే అంతంత మాత్రంగా ఉండేది.
రేనాటి చోళుల కాలం లో తెలుగు లో చిన్న చిన్న శాసనాలు బయలుదేరినా వాటి భాష సులభం గా అర్థం కాదు.
తూర్పు చాళుక్యుల మొదటి శాసనాల్లో కూడా ప్రాకృత భాషా ప్రభావం చాలా ఉంటుంది.
కాకతీయుల నాటికి తెలుగు స్వతంత్ర స్థితి పొంది వాక్యరచన, పద్యరచన సరళంగా ఉంటాయి.
-----------------

ఈ కారణాల చేత కాకతీయుల చరిత్ర మనకు ఆసక్తిదాయకం గా ఉంటుంది.

Tuesday, August 09, 2005

కాకతీయ యుగము - పరిచయము (, ఇంకో విషయం)

పరిచయాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి కార్యదర్శులైన దేవులపల్లి రామానుజరావు గారు రాశారు. 1975 ని మన ప్రభుత్వం తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించిందట. సభలు హైదరాబాదులోనే జరిగాయని పరిచయంలో ఉంది.

ఇంకో విషయం: ఈ పుస్తకం already చాలా సరళమైన భాషలో ఉంది. నేను కేవలం దాన్ని కుదించి రాస్తున్నాను.

Monday, August 08, 2005

కాకతీయ యుగము - ముందుమాట

"మరవరాని మాటలు" తర్వాతి పుస్తకం "కాకతీయ యుగము". ఇది online దొరుకుతుంది. Digital Library of India లో tif files డౌన్ లోడ్ చేసి చదవొచ్చు.

ఇది ప్రపంచ తెలుగు మహాసభ వారి ప్రచురణ. ప్రథమ ముద్రణ 1975 లో.
రచయిత ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు.
కాపీ రైట్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి వారిది. కానీ online పెట్టేశారు కాబట్టి బాగానే కాపీ కొట్టొచ్చనుకుంటా. అప్పటి వెల రెండున్నర రూపాయలు.

ముందుమాట రాసినవారు అప్పటి మన ముఖ్యమంత్రి (1973-1978) జలగం వెంగళరావుగారు. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల అధ్యక్షులు కూడా ఆయనే. ఆ సభలు April 12, 1975 తెలుగు ఉగాది రోజున మొదలై ఒక వారం పాటు జరిగాయట. ఎక్కడ జరిగాయో రాయలేదు. హైదరాబాదులోనేమో. వెంగళరావుగారు "తెలుగు ప్రజలు, భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన వివిధ రంగాలలో సాధించిన ఘనవిజయాలను విశదం చేసే గ్రంథాలు అనేకం ఈ మహాసభల సమయంలో విడుదల అవుతాయి" అని రాశారు ముందుమాటలో. ఆ మిగిలినవి కూడా దొరికితే బాగుణ్ను.

"మరవరాని మాటలు" సమాప్తం

మరవరాని మాటలు ఇంతటితో సమాప్తం. నిజానికి ఇంకా చాలా ఉన్నాయి ఆ పుస్తకంలో. తెలుగు పుస్తకాలు కొనాలనిపిస్తే అజో-విభొ-కందాళం Foundation లో వెతకొచ్చు. ఈ పుస్తకం అక్కడిదే. వాళ్ల దగ్గర చాలా మంచి collection ఉంది. పుస్తకాలైతే రెండు మూడు డాలర్లకే దొరుకుతాయిగానీ shipping rates చూస్తేనే కొంచెం భయం వేస్తుంది. ఇండియాలో ship చేయరనుకుంటా. అయినా ఇండియాలో ఉన్నప్పుడు పుస్తకాల్ని web లో కొనాల్సిన అవసరమేముంది?

Sunday, August 07, 2005

Microsoft Office Telugu LIP and వాడుక తెలుగు

ఈ మధ్య Microsoft Office 2003 Telugu LIP (Language Interface Pack) కనబడింది. ఈ ప్రయత్నం చేసినందుకు Microsoft ని మనస్పూర్తిగా మెచ్చుకోవాలి. ఆసక్తి ఉన్నవారు డౌన్ లోడ్ చేసి, వాడి చూడండి.

కానీ, తెలుగులోగానీ, ఏ భాషలోగానీ Localization అంటే Application లో ఉన్న ప్రతి ఇంగ్లీషుపదాన్నీ dictionary లోంచి squeeze చేసి వచ్చినదాన్ని వాడడమని ఎందుకనుకుంటారో?

"నిక్షిప్తం రీతి, స్థాపకవ్యవస్థ, పూర్వవీక్షణ, పునరుక్తి, విధి ఫలకం, స్వయంపాఠం, అనుకూలీకృతం" - ఇవన్నీ ఏడో తరగతి తెలుగు పరీక్షలో సంధులో సమాసాలో కాదు. Microsoft Word Telugu LIP లో Menu Items.

ఏమిటీ పదాలు? ఎందుకొచ్చిన గోల? "Save" అనేందుకు నిక్షిప్తం అనాలా? "Layout" అనేందుకు స్థాపకవ్యవస్థ అనాలా?
అవే పదాలు తెలుగులో రాయొచ్చు కదా? గిడుగువారి ఆదర్శాలకి నీళ్లొదులుతూ గ్రాంథికభాషని తెలుగు software లోనూ, కొన్ని తెలుగు వెబ్ సైట్లలోనూ మళ్లీ తలెత్తుకునేలా చేయడం చూస్తే బాధగా ఉంది. తెలుగును రక్షిస్తున్నామనుకుంటూ (అమాయకంగానో, భా౤షాభిమానంతోనో) ఇలా రాయడమే నిజంగా తెలుగుని ఖూనీ చేయడం.

ఇంగ్లీషు పదాలు వాడినంత మాత్రాన భాష బలహీనపడిపోదు. సంస్కృతం onslaught ని తెలుగు సమర్థవంతంగా ఎదిరించలేదూ?
ఆ process లో ఇంకా అందంగా తయారైంది. సూర్యుడికి అచ్చతెలుగు పదమైన 'పొద్దు'ని ఎంతమంది ఆ అర్థంలో వాడుతున్నారు? తెలుగును కాపాడడమంటే "టైమెంత" అనేందుకు కొత్త, పూర్తి తెలుగు మార్గాలు వెతకడం కాదు. గ్రాంథిక తెలుగుభాషలోని కావ్యాల్ని ఎందుకు appreciate చేయలేకపోతున్నాం? పైనున్నవాటి తాతల్లాంటి పదాలవల్లే కదా. వాటితో పరిచయమున్న గొప్ప పండితులు ఆ కావ్యాల్ని వాడుక తెలుగులో రాసి ప్రచురిస్తే ఎంత బాగుంటుంది? బాలల బొమ్మల భారతాలూ, బాలల బొమ్మల రామాయణాలూ ఎందుకున్నాయి? చిన్నపిల్లల భాషలో వాటిని ప్రచురించడం వాల్మీకినీ వ్యాసుడినీ అవమానించడమేమీ కాదే. అవి చదివిన పిల్లలు ఆసక్తితో ఎప్పటికైనా అసలు కావ్యాలు చదివి అర్థంచేసుకోగలిగితే అంతకంటే కావలసిందేమిటి?

పెద్దల హరవిలాసాలూ, పెద్దల మనుచరిత్రా, పెద్దల ఆంధ్రమహాభారతమూ ప్రతిపదార్థ, టీకా, తాత్పర్యాలతో, చవగ్గా, అందరూ చదవగలిగే విధంగా రావాలి.
విధి, అంతరంగాలు వంటి సీరియల్స్ కి ఖర్చుపెట్టగా మిగిలిన డబ్బుతో రామోజీరావుగారో, సూపర్ లాంటి చిత్రరాజాలకి ఖర్చుపెట్టగా మిగిలిన చిల్లరతో అక్కినేని వారో ఇలాంటి initiatives తీసుకోవడం, లేక/"మరియు" విశాలాంధ్ర లాంటి సంస్థలని ప్రోత్సహించడం చేస్తే తెలుగువారంతా ఆనందిస్తారు. తరాలకి తరాలు గుర్తుపెట్టుకుంటాయి.

Saturday, August 06, 2005

Unicode Telugu Dictionary - C. P. Brown

ఈ రోజు చాలా మంచి లింకొకటి దొరికింది. A Telugu-English dictionary by Charles Philip Brown (1798-1884).

విశేషమేంటంటే దాన్ని Unicode తెలుగులో వాడుకోవచ్చు.
విచిత్రమేంటంటే "This dictionary is funded in part by the U.S. Department of Education".

University of Chicago లోని Digital South Asia Library వాళ్లదీ project. DDSA (Digital Dictionaries of South Asia) initiative లో మన తెలుగువి రెండు ఉన్నాయి.

Suggestions: Display options కొంచెం కింద ఉన్నాయి. "I have a Unicode font installed" check చేసి పదాల కోసం search చెయ్యండి. IE లో తెలుగు బాగానే కనిపిస్తుందిగానీ కొన్ని phonetical symbols సరిగ్గా కనబడకపోవచ్చు. Firefox లో అలాంటి సమస్యలు రాలేదు.

Monday, August 01, 2005

మునిమాణిక్యం, మా ఇంటావిడ - "మరవరాని మాటలు" - ప్రబంధనాయిక

Friday, July 29, 2005

కుమారసంభవం 1-20 అసూత సా నాగవధూపభోగ్యం

అసూత సా నాగవధూపభోగ్యం
మైనాక మంభోనిధిబద్ధసఖ్యం
క్రుద్ధేపి పక్షచ్ఛిది వృత్రశత్రా
వవేదనాజ్ఞం కులిశక్షతానామ్

నాగకన్యలకు వరుడు, సముద్రునికి బద్ధమిత్రుడు, పర్వతాల రెక్కలు తెగకోయడానికి ఇంద్రుడు కోపంతో ప్రయోగించిన వజ్రాయుధాన్ని కూడా తప్పించుకున్నవాడు ఐన మైనాకుడిని ఆ మేనాదేవి కన్నది.

కుమారసంభవం 1-19 కాలక్రమే ణాథ తయోఃప్రవృత్తే

కాలక్రమే ణాథ తయోఃప్రవృత్తే
స్వరూపయోగ్యే సురతప్రసంగే
మనోరమం యౌవన ముద్వహన్త్యా
గర్భోభవత్ భూధర రాజపత్న్యాః

కాలక్రమాన, ఆ దంపతులకి స్వరూపయోగ్యమైన సురతప్రసంగం జరగగా, మనోహరమైన యౌవనంలో ఉన్న ఆ పర్వతరాజపత్ని గర్భందాల్చింది.