Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Tuesday, August 16, 2005

కాకతీయ యుగము - మొదటి ప్రోలరాజు (1030-1075)

కాకతీయ యుగము - మొదటి ప్రోలరాజు (1030-1075)

మొదటి బేతరాజు కుమారుడైన ఇతడు తండ్రిని మించిన పరాక్రమశాలిగా, రాజనీతిజ్ఞునిగా కనిపిస్తాడు. ప్రోలరాజు పశ్చిమ చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరునికి (1042-1068) సమకాలికుడు.

సోమేశ్వరునికి ఆహవమల్ల, త్రైలోక్యమల్ల బిరుదులు ఉన్నాయి. ఈ చక్రవర్తి దండయాత్రల్లో ప్రోలరాజు ప్రముఖపాత్ర వహించి హనుమకొండ విషయాన్ని శాశ్వతపట్టాగా పొందాడు. పశ్చిమ చాళుక్యల దయాధర్మాల మీద హనుమకొండ రాజ్యాన్ని సంపాదించాడని అనుకోవడం పొరపాటు. అది అతని పరాక్రమార్జితమే. అయినా మహాబలవంతులైన చాళుక్యులను వినయగతిచేత సుముఖులను చేసుకోవడం మంచిదని భావించాడు. పశ్చిమ చాళుక్యులకూ ఇతని అవసరముంది. చోళులని ఓడించే ప్రయత్నంలో కాకతీయుల తోడ్పాటు వారికి కావాలి.

ప్రోలరాజు విజయాలు కొన్ని అతని కుమారుడు రెండవ బేతరాజు కాజీపేట శాసనం లో కనబడతాయి. ప్రోలరాజు నిర్వక్రీకృత చక్రకూట విషయుడు. భద్రంగ విద్రావణుడు. కొంకణ మండలాన్ని జయించి యశస్సు దిక్కులకు వ్యాపింపజేశాడు. కొడపర్తి దుగ్గ (ర్గ) రాజు కొడుకును జయించి అడవులకు పారద్రోలాడు. పురుకూటాధిపుడైన గొన్న అనేవాడిని యుద్ధంలో సంహరించాడు.

మొదటి బేతని సాహసకార్యాల లాగానే ప్రోలుని చర్యలను కూడా పశ్చిమ చాళుక్యుల దండయాత్రల్లో భాగంగా అర్థం చేసుకోవాలి.

బిల్హణుడు తన విక్రమాంకదేవ చరిత్ర లో ఆరవ విక్రమాదిత్యుడు రాజకుమారునిగా ఉన్న కాలం లో చేసిన వీరకృత్యాలను వర్ణించాడు. యవ్వనం లోనే ఇతడు తండ్రి ఆజ్ఞ ను పొంది చోళుల పైన విజయ యాత్ర సాగించాడు. మొదట కొంకణ మండలాన్ని సాధించి, కేరళ పాండ్య మండలాల మీదుగా గంగైకొండపురాన్ని, కాంచీనగరాన్నీ జయించి, వేంగి మీదుగా బస్తరు రాజ్యం లోని చక్రకూటనగరాన్ని సాధించాడు.

చాళుక్యుల మిత్రుడైన ప్రోలుడు కూడా ఈ విజయ పరంపర లో భాగం వహించినట్లు రెండవ బేతరాజు కాజీపేట శాసనం నిరూపిస్తూంది. చక్రకూట మండలం లో ఉన్న భద్రంగ, పురుకూట ప్రాంతాలని కూడా ప్రోలుడు జయించాడు. దుర్గరాజు కుమారుడు పాలించిన కొడపర్తి గ్రామం వరంగల్లు జిల్లా లో ఉంది.

ప్రోలుడు రణరంగం లోనే విస్తారం గా ఉన్నా తన రాజ్యక్షేమాన్ని మరవలేదు. కంచి ఏకామ్రనాథ దేవాలయం శాసనాన్నిబట్టీ, గణపతి దేవుని మోటుపల్లి శాసనాన్నిబట్టీ ప్రోలరాజు జగత్కేసరి సముద్రం అనే పెద్ద తటాకమును నిర్మించి వ్యవసాయానికి సౌకర్యం కలిగించినట్లు తెలుస్తూంది. ప్రోలరాజు కుమారుడు రెండవ బేతరాజు తండ్రికి పుణ్యంగా కేసరి సముద్రానికీ, సెట్టి సముద్రానికీ వరుణ ప్రతిష్ఠ చేసినట్లు హనుమకొండ శాసనం సూచిస్తూంది. ప్రోలుడు శివారాధకుడు. లకులీశ్వర ఆగమం లో గొప్ప ప్రవీణుడైన రామేశ్వర పండితుని శిష్యుడు. ఇంతేకాక దీనానాథ జనులకు నిరతాన్నదాత అని శాసనం చెబుతూంది. ప్రోలరాజు వైజనపల్లి అనే గ్రామాన్ని శివపురము అనే పేరుపెట్టి తన గురువైన రామేశ్వర పండితునికి అర్పించాడు.

దీనినిబట్టి ప్రారంభం నుంచి కాకతీయ వంశం లో శైవం ప్రతిష్ఠితమైందని తెలుస్తూంది.

1 Comments:

Anonymous Anonymous said...

This comment has been removed by a blog administrator.

Tuesday, August 16, 2005 9:18:00 AM  

Post a Comment

<< Home