Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Tuesday, August 16, 2005

కాకతీయ యుగము - రెండవ బేతరాజు (1075-1090) - మొదటి భాగం

రెండవ బేతరాజు(1075-1090)

తండ్రి ప్రోలరాజు లాగానే రెండవ బేతరాజు కూడా గొప్ప పరాక్రమశాలి. ఇతనివి రెండు మూడు శాసనాలు కనబడుతున్నాయి.

కాజీపేట దర్గా లోని మొదటి శాసనం లో ఈయన పరాక్రమాన్ని బాగా వర్ణించారు. ఇతడు పరభూపదవాగ్ని. చోళమాళవ మదేభ మృగారి, విక్రమచక్రి, చలమర్తిగండ, దారిద్ర్య విద్రామని అని ఆయనకు బిరుదులు ఉన్నాయి. హనుమకొండ లో తన పేరు మీద బేతేశ్వరునికి దేవాలయం కట్టించాడు. శివపురము అనే తీర్థాన్ని పెట్టించాడు.

రెండోది కూడా దర్గా శాసనమే. ఇది 1090 నాటిది. త్రిభువనమల్లదేవర రాజ్యకాలమున అతని పాదపద్మోపజీవియైన కాకతి బేతరసు ప్రమోద సంవత్సర కార్తీక బహుళ అమావాస్య నాటి సూర్యగ్రహణ పుణ్యకాలమున హనుమకొండ నైరృత భాగమున శివపురమును ప్రతిష్ఠించాడు. శ్రీపర్వత (శ్రీశైలం) మల్లికార్జున శిలామఠాధిపతియగు అళియ రామేశ్వర పండితుడను శైవాచార్యుణ్ణి యథావిధిగా సత్కరించి పాదప్రక్షాళన, హస్తోదక పూర్వకంగా ఒక గ్రామం దానం చేశాడు. ఆ గ్రామానికి చెందిన నిధి నిక్షేపాలు, పన్నులు వగైరా సమస్త ఆదాయ సాధనములు సర్వసమస్యంగా ఇచ్చివేశాడు.

1079 నాటి ఇతని హనుమకొండ శాసనం ఒకటి కనబడుతూంది. తాను కట్టించిన బేతేశ్వరాలయం లోని ప్రోలేశ్వర దేవునికి నందాదీపానికై నిత్యం పండ్రెండు మానికల నెయ్యి పోయడానికి వ్యవస్థ చేశాడు. సబ్బనెరాచి శెట్టి కూడా తన ఇల్లు, గానుగ ఇచ్చాడు.

1119 నాటి మాటూరు శాసనం దుర్గ్యాహ్యం గా ఉన్నా దానిలోని "గతాంధ్రవైభవం నిలిపిపాడిరి" అనే వాక్యాన్ని బట్టి (అప్పటికే ఒకసారి ఆంధ్రవైభవం గతాంధ్రవైభవమైపోయిందా?) రెండవబేతరాజు కాలం లో అతని రాజ్యం ఊగిసలాడే పరిస్థితులు ఏర్పడ్డాయనిపిస్తుంది.

రెండవ బేతనికి ఏర్పడిన సమస్య ఎలాంటిది? అది అతని మిత్రులు, సామ్రాజ్యాధికారులు అయిన పశ్చిమ చాళుక్యుల వల్ల కలిగింది. చాళుక్య మొదటి సోమేశ్వరుని తర్వాత అతని పెద్ద కుమారుడు రెండవ సోమేశ్వరుడు (1068 - 1076) అధిష్ఠించాడు. అతని తమ్ముడు, మహాపరాక్రమశాలి అయిన విక్రమాదిత్యునికి గిట్టలేదు. వారసత్వానికై అన్నదమ్ములు భయంకరం గా పోరాడారు. రెండవ సోమేశ్వరునికి కులోత్తుంగచోడుని సహాయం లభించినట్లుంది. ఏమైనా తుది విజయం విక్రమాదిత్యునికి లభించింది. సోమేశ్వరుడు కారాగారబద్ధుడయాడు. విక్రమాదిత్యుడు ఆరవ విక్రమాదిత్యునిగా 1076-1126 మధ్య యాభై సంవత్సరాలు నిరాఘాటం గా రాజ్యాన్నేలాడు.

-సశేషం-

2 Comments:

Anonymous Anonymous said...

Is it possible to put these things on wiki? at http://te.wikipedia.org

Wednesday, August 24, 2005 2:19:00 AM  
Blogger V G said...

I'm thinking of doing something like that eventually.

Thursday, August 25, 2005 6:09:00 AM  

Post a Comment

<< Home