Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Saturday, August 13, 2005

కాకతీయ యుగము - మొదటి బేతరాజు (994-1030)

కాకతీయ యుగము - మొదటి బేతరాజు (994-1030)

మొదటి బేతరాజు నే కాకతీయ వంశప్రారంభకునిగా చరిత్రకారులు గుర్తిస్తున్నారు. మేనత్త అయిన కుంతలదేవి - కామసాని రాజ్యప్రతినిధిత్వం లో బాల్యం గడిపి 994 ప్రాంతాల్లో రాజ్యాధికారం స్వీకరించి ఉంటాడు.

ఈయన వేయించిన శాసనాలేవీ బయటపడలేదు కానీ ఇతని మనవడు రెండవ బేతరాజు ప్రకటించిన శాసనాల్లో మొదటి బేతరాజు ఘనత వర్ణించారు. సామంత విష్టివశుడు, కాకతి పురాధినాథుడు అయిన బేతరాజు చోడ క్ష్మాపాల సైన్యసముద్రాన్ని మధించి వీరలక్ష్మి ని పొందాడని రాశారు.

పరిమిత శక్తి గల బేతరాజు చోడ సైన్యసముద్రాన్ని ఎలా మధించాడు? ఇతడు స్వయంగా ఈ మహాకార్యం చేయలేదు. మిత్రులైన పశ్చిమ చాళుక్యుల పక్షం వహించి చోళులను నిర్జించాడు.

పశ్చిమాన కళ్యాణి లో రెండవ చాళుక్య సామ్రాజ్యం స్థాపించిన రెండవ తైలపుడు 997 లో మరణించగా అతని కుమారుడు సత్యాశ్రయుడు (997-1008) సింహాసనం అధిష్ఠించాడు.

ఇప్పుడు చోళ సామ్రాజ్యాన్ని మహాబలశాలి అయిన రాజరాజ చోళుడు ఏలుతున్నాడు. చోళులకు చాళుక్యులకు ఎడతెగని వైరం.

సత్యాశ్రయుడు కొత్తగా రాజ్యానికి వచ్చిన అదను చూసుకొని రాజరాజచోళుడు రట్టిపాడి పై దాడి చేసి చాలా నష్టం కలిగించాడు. సత్యాశ్రయుడు క్రమంగా బలం కూడదీసుకొని చోళులని వెనుకకు తరిమివేశాడు.

అంతేగాక వారి రెండవ రాజధాని అయిన కాంచీపురాన్ని చాళుక్యులు ఆక్రమించారు.

ఈ దాడులలో కాకతి మొదటి బేతరాజు చాళుక్యుల పక్షాన ఉండి వీరవిహారం చేశాడని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంచీపుర విజయంలో బేతని సేనాపతి బమ్మ (బ్రహ్మ) సేనాని గొప్పగా విజృంభించినట్లు తెలుస్తూంది.

కాకతి గణపతిదేవుని రాజ్యాన్ని రక్షించిన రేచెర్ల రుద్రసేనాని వేయించిన పాలంపేట శాసనంలో (క్రీ. శ. 1213) బమ్మసేనాని ప్రశస్తిని వర్ణించారు. "తూర్పునాదములు చెలరేగగానే యవనికాసదృశమైన కాంచీపుర కవాటాన్ని తొలగించి బమ్మసేనాని కాకతివల్లభునకు వీరలక్ష్మీ వివాహం నిర్వహించాడు".

బమ్మసేనాని పరాక్రమాన్ని పిల్లలమర్రి శాసనంలో కూడా ప్రశంసించారు. దీనిని బమ్మసేనాని వంశీయుడైన నామసేనాని వేయించాడు. "ప్రచండాహవమునందు బమ్మసేనాని కాంచీనగర కవాటహరణము కావించి చోళనరాధిపుని అభిమాన ద్రుమమును ఉన్మూలించాడు".

అయితే ఈ విజయాన్ని కొందరు బేతని కుమారుడు మొదటి ప్రోలరాజు కు ఆరోపిస్తున్నారు. ఇది ఒక విధంగా నిజమైనా కావచ్చు.

రాజరాజచోళుడు, ఆతని కుమారుడు రాజేంద్రచోళుడు అవక్రపరాక్రములు. వారి కాలం లో పశ్చిమ చాళుక్యులకు గాని వారి సామంతులు కాకతీయులకు గాని చోళసామ్రాజ్యం మీద విరుచుకుపడే అవకాశం వచ్చి ఉండదు.

ఈ సన్నివేశం పశ్చిమ చాళుక్య రెండవ జయసింహుని (1015-1042) రాజ్యాంతకాలం లో జరిగేందుకు అవకాశముంది. అది మొదటి ప్రోలుని రాజ్యారంభకాలం అవుతూంది. యువకుడైన ప్రోలుడు కూడా బమ్మ సేనాని తో పాటు తండ్రి అయిన మొదటి బేతరాజు కు సాయపడి ఉండవచ్చు.

ఇదే కాలం లో తూర్పు చాళుక్యుడైన మొదటి శక్తివర్మ రాజరాజచోళుని సహాయం తో వేంగి రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు.

బేత, ప్రోల రాజులు తెలుగు వారే. శక్తివర్మ, విమలాదిత్యుడు, రాజరాజ నరేంద్రుడు - వీరూ తెలుగు వారే. కానీ వీరు కలిసినట్లు కనిపించదు. వారి వారి మిత్రులు వేరవటమే దీనికి కారణం.

తమ తమ నెలవులు దప్పిన, తమ మిత్రులు శత్రులగుట తథ్యము సుమతీ! అని బద్దెన చెప్పింది నిజమే అనిపిస్తుంది.

0 Comments:

Post a Comment

<< Home