Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Friday, August 12, 2005

కాకతీయ యుగము - కాకర్త్య గుండ్యన

కాకతీయ యుగము - కాకర్త్య గుండ్యన

ఇతన్ని గురించి తెలిసినా,ఇతనికీ మొదటి బేతరాజు కూ గల సంబంధం గురించి చరిత్రకారులు సందేహిస్తున్నారు. ఈ సందర్భం లో మనకు ప్రతాపచరిత్ర, సిద్ధేశ్వరచరిత్ర వంటివి తోడ్పడినా వీటిలో నిజమైన చరిత్ర, పుక్కిటి పురాణాలూ కలగాపులగం గా ఉండడం వల్ల ఇంకా సంశయం కలుగుతూంది.అయితే వాటిలో చెప్పినవన్నీ కొట్టిపారేయనక్కర్లేదు.

ఈ పూర్వ వృత్తాంతాలని బట్టి కాకతీయ చరిత్ర ఇలా ఉంటుంది:

మన అత్యంత ప్రాచీన రాజవంశాల్లో ఆనందగోత్రీకులు ఒకరు. వీరు కందరపురాధిపతులు. పల్లవుల తో జరిగిన ఒక యుద్ధం లో ఈ వంశీయుడైన సోమదేవరాజు మరణించగా ఆయన రాణి సిరియాలదేవి హనుమకొండ వచ్చి తలదాచుకుంది. ఆమె కుమారుడు మాధవవర్మ పెద్దవాడైన తర్వాత హనుమకొండ రాజ్యం ఆక్రమించుకున్నాడు. పద్మాక్షి దేవి ఇతని వంశం హనుమకొండలో వెయ్యేళ్లు వర్ధిల్లుతుందని వరమిచ్చింది. ఆనందగోత్రీకులు క్రీ. శ. 4వ శతాబ్దం మొదట్లో కృష్ణాతీరాన్ని పాలించినవారు. ఓరుగల్లు పతనము క్రీ. శ. 1323 లో. మధ్యలో వెయ్యేళ్లు ఉన్నాయి. ఇది అద్భుత కథనం గా తోస్తుంది.

మాధవవర్మ తర్వాత గుర్తించడానికి వీలు లేని కొందరు రాజులు హనుమకొండ సింహాసనాన్ని అధిష్ఠించారు.

వీరిలో పెండ్లి గుండమరాజు ఒకడు. ఇతడే కాకర్త్య గుండ్యన అయ్యుండవచ్చు. గుండ్యన తూర్పు చాళుక్యుల వద్ద ఉన్నతోద్యోగి అని మాగల్లు శాసనం వల్ల తెలుస్తోంది. అతడే పెళ్లి సంబంధం ద్వారా హనుమకొండ రాజ్యానికి వారసుడయ్యాడని ఊహించవచ్చు.

ఇతనికి కుంతలదేవి అనే సోదరి ఉంది. ఆమెను విరియాల వంశం లో పెళ్లి చేసి గుండ్యన తన స్థానాన్ని కొంత బలపరచుకున్నాడు.

విరియాల వారి వృత్తాంతాన్ని 1000 ప్రాంతం లో వెలసిన గూడూరు శాసనం లో చక్కగా వర్ణించారు. వీరిలో వెన్న, ఎర్ర, భీమ అనే ప్రసిద్ధవీరుల తర్వాత మరొక ఎర్ర నరేంద్రుడు జన్మించాడు. ఇతడు పరాక్రమశాలి. ఈయన భార్య కామమసాని వీరవనిత, రాజనీతిజ్ఞురాలు.

గుండ్యన సోదరి కుంతలదేవినే మనం విరియాల కామమసానిగా గుర్తిస్తున్నాము. ఈ సమీకరణం ఇలా కుదురుతూంది:

సిద్ధేశ్వర చరిత్ర ప్రకారం: గుండమరాజు కొడుకైన ఎరుగదేవరాజు బాలుడు కావడం వల్ల కుంతలదేవి రాజ్యసంరక్షకురాలిగా పందొమ్మిదేండ్లు రాజ్యభారం వహించింది.

గూడూరు శాసనం ప్రకారం: విరియాల రెండవ ఎర్రనరేంద్రుడు పిల్లవాడైన బేతరాజు పక్షం వహించి అతని శత్రువులను యుద్ధం లో సంహరించాడు. ఆయన భార్య కామసాని తన భర్త ఆరంభించిన సదుద్యమాన్ని సమర్థత తో నిర్వహించింది. బేతరాజు ను కాకతి వల్లభుని చేసి కాకతీయ రాజ్యం నిలబెట్టింది. ఇలా చేయడం - కాకతినిల్పుట కోటిసేయదే - అని శాసనకారుడు కామసానిని ప్రశంసించాడు. నిజమే. అది అలాంటిదే.

పై రెండు ఆధారాలూ సమీకరించి ఇలా చెప్పగలుగుతున్నాము:

కాకర్త్య గుండ్యన 970 ప్రాంతాలలో హనుమకొండ రాజకుటుంబం తో సంబంధం చేసుకొని రాజ్యలాభం పొందాడు.
స్థానం స్థిరపరచుకొనే లోపే మరణించాడు.
అతని కుమారుడు చిన్నవాడు. అతడే పొట్టిబేతడు. చరిత్రకు తెలిసిన మొదటి బేతరాజు ఇతడే.
తండ్రి మరణసమయానికి ఇతడు చిన్నవాడవటం వల్ల కాకతీయ రాజ్యం ప్రమాదం లో పడింది.
ఈ స్థితి లో కాకతీయులకు బంధువులు, సామంతులు అయిన విరియాల వారు రాజ్యాన్ని కాపాడి బేతడికి అప్పగించారు.

ఇది నిజంగా గొప్ప విషయం. అందరిలాగానే విరియాల వారు కూడా రాజ్యాన్ని అపహరించే ప్రయత్నం చేసి ఉంటే కాకతీయ సామ్రాజ్యం పురుటిలోనే అదృశ్యమయేది. కాకతీయులు సామంతుల విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పాలి. గణపతిదేవుడి బాల్యం లోనూ ఇలాంటి సన్నివేశమే జరిగింది. యాదవులతో యుద్ధంలో మహదేవరాజు మరణించాడు. గణపతిదేవుడు చెరపట్టబడ్డాడు. కాకతీయ రాజ్యం చుక్కాని లేని పడవలా తయారైంది. శత్రువర్గం తిరుగుబాట్లు లేవదీస్తోంది. ఈ విపత్కర సమయం లో స్వామిభక్తి పరాయణుడైన రేచెర్ల రుద్రసేనాని రాజ్యాన్ని ఆదుకొని, శత్రువులను చెండాడి, సామ్రాజ్యాన్ని నిలబెట్టి గణపతిదేవుడికి అప్పగించాడు.

విరియాల రెండవ ఎర్ర నరేంద్రుడు, అతని భార్య కామసాని సరిగ్గా ఇదే పని రేచెర్ల రుద్రుడికి రెండు శతాబ్దాల పూర్వం చేశారు.

0 Comments:

Post a Comment

<< Home