Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Saturday, August 13, 2005

కాకతీయ యుగము - విరియాల కామసాని

కుంతలదేవి - కామసాని ప్రతిభాసామర్థ్యాలు అర్థం కావాలంటే కాకతీయ సామ్రాజ్య ప్రారంభావస్థ లో దేశ పరిస్థితుల్ని గమనించాలి.
అది క్రీ. శ. 970 - 1000 మధ్య కాలం.
హనుమకొండ కు పశ్చిమాన ఉన్న రాష్ట్రకూట సామ్రాజ్యం 973 లో విచ్ఛిన్నమైంది.
పూర్వపు చాళుక్యులే తిరిగి బలం సంపాదించుకుని తైలపదేవుడి నాయకత్వం లో కళ్యాణి ముఖ్య పట్టణం గా రెండవ చాళుక్య సామ్రాజ్యం స్థాపించారు. వీరే కళ్యాణి చాళుక్యులు.

ఇటు తూర్పు చాళుక్యల లో కూడా విప్లవం బయలుదేరింది.
రెండవ అమ్మరాజు సవతి అన్న అయిన దానార్ణవుడు 970 లో పాలన ఆరంభించాడు. ఇంకో మూడేళ్లలోనే, 973 ప్రాంతం లో, తెలుగు చోడుడైన జటా చోడ భీముడు దానార్ణవుడిని యుద్ధం లో సంహరించి వేంగీ చాళుక్య రాజ్యాన్ని ఆక్రమించాడు.

దక్షిణాన చోళ సామ్రాజ్యం ఉంది కానీ అంత ప్రబలం గా లేదు.

ఇలాంటి సంధికాలం లో ఉపాయశాలి ఐన కాకర్త్య గుండ్యన చిన్న రాజ్యం స్థాపించుకున్నాడు కానీ అది బలపడే లోపు మరణించాడు. శైశవావస్థ లో ఉన్న కాకతీయ రాజ్యానికి ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదం బహుశా ముదిగొండ చాళుక్యులు అనే వారి నుంచి వచ్చి ఉంటుంది. వీరు తూర్పు చాళుక్యులకు మిత్రులు, సామంతులు అయినట్లు మొదటి చాళుక్య భీముని (892 - 921) కొరవి శాసనం చెబుతూంది. ఇది వరంగలు జిల్లా మానుకోట తాలూకా లో ఉంది. కొత్తగా ఏర్పడిన కాకతీయ రాజ్యం కొరవి సీమ లోకి వ్యాపించడానికి ప్రయత్నం చేసినపుడు సహజం గానే వీరు నిరోధించి ఉంటారు. విరియాల ఎర్ర భూపతి సంహరించినట్లు గూడూరు శాసనం ప్రకటిస్తున్న "ఉద్ధతవైరి" బహుశా ముదిగొండ చాళుక్య రాజై ఉంటాడు.

అంతటితో కాకతీయుల కష్టాలు తీరలేదు. బలవంతుల సహాయం కావలసి వచ్చింది. ఆ సమస్య నే కామసాని పరిష్కారం చేసింది. తూర్పు చాళుక్య రాజ్యం కూడా విప్లవానికి గురి అవడం చేత అటు నుండి సహాయం లభించదని ఆమె గ్రహించింది. వేగి రాజ్యం కన్నా బలవత్తరమైన కళ్యాణి చాళుక్య సామ్రాజ్యం పశ్చిమాన పరవళ్లు తొక్కుతూంది. వారి సాయం లభిస్తే కాకతీయ రాజ్యం స్థిరపడుతుందని గ్రహించి ఆ ప్రయత్నం చేసి కృతకృత్యురాలైంది. కాకతి నిల్పడం అంటే ఇదే.

శైశవావస్థ లో ఉన్న కాకతీయ రాజ్యానికి మహాబలశాలులైన మిత్రులు దొరికారు. అప్పటి నుండి ఒక శతాబ్దం పైగా కామసాని రాజనీతే కాకతీయుల విదేశాంగ నీతి అయింది. కాకర్త్య గుండ్యన కాలం 950-975 అని చిలుకూరి వీరభద్రరావు పంతులు గారు గ్రహించారు కాబట్టి కుంతలదేవి - కామసాని 19 సంవత్సరాలు రీజెంటు గా ఉన్నట్లయితే మొదటి బేతరాజు 994 ప్రాంతం లో పాలన ఆరంభించి ఉంటాడు. ఇతడు 1030 వరకూ రాజ్యం చేశాడని చరిత్రకారులు భావిస్తున్నారు.

0 Comments:

Post a Comment

<< Home