తెలుగువారూ కాకతీయులగురించి వినే ఉంటారు. లక్ష్మీరంజనం గారైతే "ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రముఖస్థానం గల కాకతీయ వంశము వారి యశోగానం చెయ్యడం మనవిధి" అన్నారు, మనమసలు ముందు వారి గురించి కొంచెం తెలుసుకుందాం.
కాకతీయుల గురించి ఎందుకు తెలుసుకోవాలి?
-----------------
1) కాకతీయులు తెలుగుదేశాన్ని సుమారు 325 సంవత్సరాలు (1000 AD - 1323 AD) పరిపాలించారు.
2) 225 BC - 225 AD మధ్యలో తెలుగుదేశాన్నే గాక దక్షిణాపథంలో విస్తారమైన భాగాన్ని పాలించిన శాతవాహనులకన్నా, 625 AD -1075 AD మధ్యలో వేంగీదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్యులకన్నా కాకతీయులు మనకు బాగా సన్నిహితులు.
శాతవాహనుల గురించి మనకు తెలిసింది తక్కువైతే తూర్పుచాళుక్యులు ముఖ్యంగా మన సముద్ర తీర ప్రాంతాన్ని ఏలినవారు. తూర్పు చాళుక్యులు గురించి నన్నయ వల్ల, ఆయన్ని ప్రేరేపించిన రాజరాజ నరేంద్రుడనే మహారాజు వల్ల మన గ్రామాల్లో కూడా కొంత తెలుసు.
3) శాతవాహనులు తాము ఆంధ్రులమని ప్రత్యేకంగా చెప్పుకోలేదు. పురాణాలు వీరిని ఆంధ్రవంశీయులన్నాయి కాబట్టి వీరు ఆంధ్రులని మనకు ధ్రువపడుతోంది. నన్నయకూడా వేగీదేశమనే వర్ణించాడు. ఆంధ్రశబ్దం లేదని కాదు. నిజానికి మూలంలో లేకపోయినా ఆంధ్రమహాభారతంలో తెలుగుదేశ ప్రసక్తిని తెచ్చి (దక్షిణగంగనా) నన్నయ తన మాతృదేశ భక్తిని ప్రదర్శించాడు.
కాకతీయుల కాలానికి ఆంధ్రదేశ భావన బాగా స్థిరపడినట్లుంది. ఈ కాలానికే చెందిన తిక్కన సోమయాజి తన మహాభారత పీఠికలో "ఆంధ్రావళి మోదముబొరయ" అని రాశాడు. ప్రతాపరుద్ర చక్రవర్తిని గురించి క్రీడాభిరామం లో "ఆంధ్రోర్వీశు మోసాలపై" అని వర్ణించారు.
తూర్పుచాళుక్యుల అధికారం సమగ్రాంధ్రంపై చెల్లలేదు. వీరికాలంలో పశ్చిమాంధ్రం వాతాపి చాళుక్యులు, రాష్ట్ర్రకూటులు, కళ్యాణి చాళుక్యుల అధీనంలో ఉండిపోతూ వచ్చింది. ఈ కారణంవల్ల శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్నంతటినీ పాలించిన రాజకుటుంబాలలో కాకతీయుల్నే ముందు చెప్పాలి.
4) కాకతీయులకీ, వారి సామంతులకీ సంబంధించిన శాసనాలు తెలంగాణాలో ఇప్పటికీ చాలా దొరుకుతున్నాయి. హనుమకొండ, పాలంపేట, పిల్లలమర్రిలో వారికాలంలో నిర్మించిన గొప్ప దేవాలయాలు శిథిలావస్థలోనైనా నిలిచి ఉన్నాయి. వారు తవ్వించిన పాకాలచెరువు, లక్నవరం చెరువు, ధర్మసాగరం వంటివాటివల్ల తెలంగాణకి కాసారములనాడు అని ప్రసిద్ధివచ్చిందట. వారిచ్చిన అగ్రహారాల గురించీ, భూవసతుల గురించీ శాసనాల ద్వారా విస్తారంగా తెలుస్తున్నాయి.
5) కాకతీయులనాటి వాఙ్మయంకూడా బాగా లభిస్తూంది. వాటిలో కొన్ని:
విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణము
మార్కండేయ పురాణము
శివయోగసారము
క్రీడాభిరామము
ఏకామ్రనాథుని ప్రతాప చరిత్ర
కానెసర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర
మార్కో పోలో, ఇబ్న్ బటూటా ల యాత్రావిశేషాలు
కాకతీయుల సామంతులైన నెల్లూరి చోడుల ఆస్థానానికి చెందిన తిక్కన సోమయాజి రచించిన నిర్వచనోత్తర రామాయణం
ముస్లిం చరిత్రకారులైన ఈసామీ, బర్నీ, ఖుస్రూ, ఫెరిస్తా మొదలైనవారి రచనలు.
6) కాకతీయవంశీయులైన గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇప్పటికీ అందరికీ గుర్తున్నారు.
7) ఆనాటి తెలుగు కూడా కొంత సుగమం గానే ఉంటుంది.
శాతవాహనుల కాలం లో తెలుగు భాష ఉనికే అంతంత మాత్రంగా ఉండేది.
రేనాటి చోళుల కాలం లో తెలుగు లో చిన్న చిన్న శాసనాలు బయలుదేరినా వాటి భాష సులభం గా అర్థం కాదు.
తూర్పు చాళుక్యుల మొదటి శాసనాల్లో కూడా ప్రాకృత భాషా ప్రభావం చాలా ఉంటుంది.
కాకతీయుల నాటికి తెలుగు స్వతంత్ర స్థితి పొంది వాక్యరచన, పద్యరచన సరళంగా ఉంటాయి.
-----------------
ఈ కారణాల చేత కాకతీయుల చరిత్ర మనకు ఆసక్తిదాయకం గా ఉంటుంది.