Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Thursday, June 30, 2005

కొడవటిగంటి, నిలవనీరు - "మరవరాని మాటలు" - ఖర్చు

కుమారసంభవం 1-7 న్యస్తాక్షరా ధాతురసేన యత్ర

న్యస్తాక్షరా ధాతురసేన యత్ర
భూర్జత్వచః కుంజరబిందుశోణాః
వ్రజంతి విద్యాధరసుందరీణాం
అనంగలేఖక్రియయోపయోగమ్

ఏనుగుల మీద వేసే గుర్తులకి వాడే ఎరుపు రంగులో ఉండే అక్కడి భూర్జవృక్షాల పట్టల పైన, ఆ హిమాలయాల్లో దొరికే ధాతువులతో అక్షరాలు రాసి, విద్యాధరస్త్రీలు వాటిని ప్రేమలేఖలుగా ఉపయోగించుకుంటారు.

(ఏనుగుల మీద రంగులతో గుర్తులు వేస్తారట.)

Wednesday, June 29, 2005

కుమారసంభవం 1-6 పదం తుషారస్రుతిధౌతరక్తం

పదం తుషారస్రుతిధౌతరక్తం
యస్మిన్నదృష్ట్వాపి హతద్విపానాం
విదన్తి మార్గం నఖరంధ్రముక్తైః
ముక్తాఫలైః కేసరిణాం కిరాతాః

అక్కడి సింహాలు ఏనుగులని వేటాడి చంపితే, ఆ ఏనుగుల నెత్తుటి జాడను బట్టి సింహాలని వేటాడే కిరాతులు, మంచు కరిగి ప్రవహించడం వల్ల, సింహాల దారి కనబడకపోయినా, వాటి దోనెల్లాంటి గోళ్లనుండి రాలిన ముత్యాలను చూసి సింహాలు ఎటు వెళ్లాయో తెలుసుకుంటారు.

(గజముక్తాలని ఒక పదప్రయోగం ఉంది. ఏనుగుల నుదుటిలో ముత్యాలుంటాయని నమ్మకమట.)

గురజాడ, కన్యాశుల్కం - "మరవరాని మాటలు" - ఇంగ్లీష్

Monday, June 27, 2005

కుమారసంభవం 1-5 ఆమేఖలం సంచరతాం ఘనానాం

ఆమేఖలం సంచరతాం ఘనానాం
ఛాయామధస్సానుగతాం నిషేవ్య
ఉద్వేజితా వృష్టిభిః రాశ్రయంతే
శృంగాణి య స్యాతపవంతి సిద్ధాః

హిమవంతుడి పర్వతాల సగం ఎత్తులో తిరిగే మేఘాల నీడని కింది చరియలలో అనుభవించే సిద్ధులు, వాటి నుంచి వర్షం పడటం మొదలవగానే చిరాకుపడి ఎండ కోసం పై శిఖరాలకి పోతారు.

Friday, June 24, 2005

కుమారసంభవం 1-4 యశ్చాప్సరోవిభ్రమమండనానాం

యశ్చాప్సరోవిభ్రమమండనానాం
సంపాదయిత్రీం శిఖరైర్బిభర్తి
వలాహకచ్ఛేద విభక్తిరాగాం
అకాలసంధ్యామివ ధాతుమత్తామ్

ఆ శిఖరాల పైన ఉండే ధాతువుల ఎరుపు రంగు మేఘపు తునకలపైన పడటం వల్ల అకాలసంధ్య అయినట్లుంటుండడం చూసి విభ్రమంతో అక్కడి అప్సరలు సాయంకాలపు ఆభరణాలను వెతుక్కుంటూంటారు.

ఆరుద్ర, స్టాప్ వాచీ - "మరవరాని మాటలు" - ఆలస్యం

Wednesday, June 22, 2005

కుమారసంభవం 1-3 అనంతరత్నప్రభవస్య యస్య

అనంతరత్నప్రభవస్య యస్య
హిమం న సౌభాగ్యవిలోపి జాతమ్
ఏకో హి దోషో గుణసన్నిపాతే
నిమజ్జతీందోః కిరణేష్వివాంకః

అనంతమైన సంఖ్యలో రత్నాలకి నిలయమైన ఆ హిమవంతుడు, తన మంచు వల్ల సౌందర్యాన్నేమీ కోల్పోలేదు. సుగుణాలు ఎక్కువ ఉంటే, ఒక దోషం ఉన్నా, అది చంద్రుడి మచ్చ కిరణాల వెలుగులో కనబడనట్లు మాటుకి వెళ్లిపోతుంది.

Tuesday, June 21, 2005

పానుగంటి, సాక్షి - "మరవరాని మాటలు" - ఆత్మ

Sunday, June 19, 2005

కుమారసంభవం 1-2 యం సర్వశైలాః పరికల్ప్య వత్సం

యం సర్వశైలాః పరికల్ప్య వత్సం
మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే
భాస్వన్తి రత్నాని మహౌషధీశ్చ
పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీమ్

(పురాణాల్లో ఒక చోట దీనికి సంబంధించిన కథ ఉంది. ఒకసారి భూదేవికి కోపం వచ్చి ప్రజలకు ధనధాన్యాలు ఇవ్వడం మానేస్తుంది. అది పృథుచక్రవర్తికి నచ్చక భూదేవిని చంపడానికి బయలుదేరుతాడు. భూదేవి గోవు రూపంలో పారిపోవడానికి ప్రయత్నిస్తుంది గానీ చివరికి చక్రవర్తికి చిక్కుతుంది. పృథువు అప్పుడు అన్ని జాతుల్లో శ్రేష్ఠమైన వారిని పాలవారిగా, దూడలుగా చేసి భూదేవినుంచి వారికి కావలసినవి తీసుకోమంటాడు.)

కథ కాంప్లికేటెడ్ గా ఉందిగానీ, శ్లోకం ప్రకారం పర్వతజాతిలో శ్రేష్ఠులు మేరువు, హిమవంతుడు అన్నమాట. పర్వతజాతికి సంబంధించిన ఓషధులు, రత్నాల్ని పృథువు చెప్పినట్లు మేరువుని పాలవాడిగా, హిమవంతుడిని దూడగా చేసి సంపాదించుకున్నారు.

మన పురాణాల్లో కనపడే ఈ మేరు పర్వతం నిజంగా భూమ్మీద ఎక్కడ ఉందో ఎవరికన్నా తెలిస్తే రాయండి.

Saturday, June 18, 2005

చలం, మ్యూజింగ్స్ - "మరవరాని మాటలు" - అజ్ఞేయం

శ్రీరాముడికీ, ధర్మరాజుకీ, ఎవరు బోధించినా, చచ్చేదాకా జ్ఞానం వొచ్చినట్లు లేదు. చివరిదాకా బోధిస్తూనే వున్నారు. అన్ని పాపాలు చేసిన అల్లరి కృష్ణుడికి చెప్పడానికి ఎవరికీ గుండెలు లేవు. పైగా ప్రపంచానికి అతనే భగవద్గీత బోధించాడు.
--
చలం రచనలు నేను చదవలేదు. చదివినవాళ్లెవరన్నా కింద చిన్న పరిచయం లా రాస్తే బాగుంటుంది.

బూదరాజు రాధాకృష్ణ గారి "మరవరాని మాటలు"

ఈ "Dictionary of Quotations from Telugu Literature" కి బూదరాజు రాధాకృష్ణ గారు సంకలన కర్త, సంపాదకుడు. పుస్తకపరిచయం లో రచయిత "ఈ కోశాన్ని ఎన్నోవిధాల ఎవరయినా ప్రస్తరించవచ్చు" అన్నారు కాబట్టి నచ్చిన కొన్ని వాక్యాల్ని అప్పుడప్పుడు ఇక్కడ రాస్తాను.

Thursday, June 16, 2005

కుమారసంభవం 1-1 అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా

కాళిదాసమహాకవి రాసిన కుమారసంభవం తెలుగు ప్రతిపదార్థతాత్పర్యాలతో దొరికింది. సంస్కృతం కూడా నేర్చుకున్నట్లుంటుందని చదవడం మొదలుపెట్టాను (పదోక్లాసు, ఇంటర్లలో మార్కులకోసం సంస్కృతం తీస్కున్నా కనీసం మాట్లాడటమన్నా రావాలి కదా). కావ్యం కత్తిలా ఉంది. మొదటి కొన్ని శ్లోకాల్లో హిమాలయాల వర్ణన నిజంగా అద్భుతం. ఛందస్సు పాటిస్తూ చెప్పటం పక్కన పెడితే అసలాంటి ఆలోచనలు చేయటమే కవిత్వమేమో.

(పదోక్లాసు సంస్కృతంలో "కన్యావరణం" అనే పాఠం గుర్తుందా? సప్తర్షులు హిమవంతుడి దగ్గరకు వస్తారు. మరీ అవమానిస్తున్నాననుకోకపోతే అది కుమారసంభవంలోదే)

ఇంటరెస్ట్ ఉన్నవాళ్లకి పుస్తకం వివరాలు:
http://www.archive.org/download/KumaraSaombhavamu/KumaraSaombhavamu.djvu
Djvu plugin: http://www.lizardtech.com

పుస్తకాన్ని 1910 లో చెన్నైలో ముద్రించారు. వెల అప్పట్లో రెండు రూపాయలు.

అప్పుడప్పుడూ ఒక సంస్కృత శ్లోకాన్నీ, రచయితల తాత్పర్యాన్నీ వాడుక తెలుగులో ఇక్కడ రాద్దామనుకుంటున్నాను. మొదటి సర్గలో మొదటి పద్యం (1-1):

అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా
హిమాలయో నామ నగాధిరాజః
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య
స్థితః పృథివ్యా ఇవ మానదండః

ఉత్తరదిక్కులో "మంచుకు ఇల్లు" అనే పేరున్న ఒక కొండలరాజు, తూర్పు, పడమరల్లో సముద్రాల్లోకి విస్తరించి భూమికి ఒక కొలబద్దలా ఉన్నాడు.

పద్యవ్యాకరణం ప్రకారం కాకుండా, ఎవరన్నా అర్థం అడిగితే చెప్పేలాగా రాశాను. లేకపోతే హిందీ, ఇంగ్లీషు అనువాదం సినిమాల్లా తయారౌతుందేమోనని (తెలుగు Jurassic Park లోనేమో, "దానమ్మకి కోపం వచ్చింది" అని అంటారు ఒక డైనోసార్ని ఉద్దేశించి).

ఇక్కడ పూర్వాపరాలంటే ముందువెనకలు కావు. తూర్పు (పూర్వం, పూరబ్), పడమర(అపరం) లు.

ఇంకోటి, ఈ పుస్తకంలో మానదణ్డః (మానదండః), స఑ఞ్చరతాం (సంచరతాం), అఙ్కః (అంకః) - ఇలా ఉంది వాడుక. ఇప్పుడెవరూ అలా రాయటంలేదు కాబట్టి అవి మార్చి రాశాను.

హిమాలయాలు నిజంగా సముద్రాల్లోకి విస్తరించి ఉన్నాయా, హిమవంతుడు నిజానికి హిమాలయాల్లో ఉండే ఒక కిరాతరాజేమో, ఆయన కూతుర్ని అక్కడే ఉండే శివుడనే అతనికిచ్చి పెళ్లి చేశారేమో లాంటి ఊహల గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పటికి కవి వర్ణనని చూద్దాం. కాళిదాసు ఎంత "పైన్నుంచి" ఆలోచించాడో ఇక్కడ చూడొచ్చు. వరసగా ఉన్న హిమాలయాల్ని చూసి, భూమికి స్కేల్ లా ఉన్నాయనడం అసలుసిసలైన abstraction.

సంస్కృతపదాలేవైనా అర్థం కాకపోతే ఇక్కడ ఒక మంచి Dictionary ఉంది. ఈ లింక్ తర్వాత్తర్వాత మారుతుందేమో కానీ "Monier Williams" అని సెర్చ్ కొడితే ఏదో ఒక కాపీ దొరుకుతుంది.

Monday, June 13, 2005

ఈ blog ఎందుకు?

ఆమధ్యెందుకో మన భాష గురించీ, చరిత్ర గురించీ తెలుసుకుందామనిపించింది. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఇప్పటికైతే http://www.dli.ernet.in), http://www.archive.org లాంటి చోట్ల దొరికే పుస్తకాలూ, కొన్ని అమెరికన్ యూనివర్సిటీ లైబ్రరీల్లో దొరక్క దొరక్క దొరికే పుస్తకాలూ, రకరకాలుగా ఇండియా నుంచి తెచ్చుకున్న, తెప్పించుకున్న పుస్తకాలూ కొన్ని చదివాను. చదవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి.

అంత మంచి పుస్తకాలను న్యూస్ పేపర్ని చదివినట్లు ఒక్కసారి చదివొదిలేయటం అన్యాయంగా తోచింది. వరంగల్ వెళ్తే ఆ ఊర్లో ఇళ్లన్నిటినీ ఫొటో తీయనక్కర్లేదుగానీ వేయి స్తంభాల గుడిలాంటివాటినైనా తీయాలి గదా? ఒక పుస్తకం చదివినప్పుడు దాని గురించి మనకనిపించింది రాస్తే ఆ పుస్తకాన్ని "ఫొటో" తీసినట్లే. ఆ "ఫొటో" మనక్కావలసినంత బాగా రాకపోవచ్చు, కానీ ఇలాంటి "ఫొటో"లు మన దగ్గరున్న ఏ మామూలు ఫొటో చేయలేని పని చేయగలవు. ఎప్పుడో తాజ్ మహల్ ముందు తీయించుకున్న ఫొటో చూస్తే మనం తాజ్ మహల్ కి వెళ్లొచ్చామనే తెలుస్తుందిగానీ అప్పుడు మనమెలా ఆలోచించేవాళ్లమో, మన దృక్పథం ఏ రకంగా ఉండేదో, మన విలువలు ఏమిటో గుర్తుకురావు. అదే ఒక డైరీలాంటిది ఉండుంటే? ఐదో క్లాసులోనేమో, "దినచర్య" అనే పాఠం ఉన్నా దాన్ని సరిగా ఉపయోగించుకోనందుకూ, నాలుగేళ్లు వరంగల్లో ఉన్నా వేయి స్థంభాల గుడిని ఫొటో తీయనందుకూ ఇప్పుడు బాధపడటంకన్నా అలాంటి తప్పులు మళ్లీ చేయకపోవడం మంచిది.

రచయితల ఆలోచనల్లో ఏదో కొంతశాతమే వారి పుస్తకాలను చేర్తాయి. అవి మనం చదివి అర్థం చేసుకునే క్రమంలో ఇంకొంత నష్టం జరుగుతుంది. ఆ అర్థంచేసుకున్నదానిగురించి మనం ఏదో రాసి దాచిపెట్టుకోగలిగింది ఇంకా తక్కువ. వేరే రచయితల వరకూ ఎందుకు? మనమే డైరీరాసినా ఎన్ని విషయాలని రాయగలం? కొన్ని తెలుగు సినిమాల్లో శుభం కార్డు పడే టైముకి సెకండ్ హీరోయిన్లు కడుపులో హీరోల ప్రతిరూపాలని పెంచుకుంటూ విదేశాలకి ఴవెళ్తారుగానీ నిజమైన సెన్స్ లో లైఫ్ కి కాపీలు తయారుచేయలేం కదా. కానీ వీలయినంత కష్టపడాలనిపిస్తుంది.

అలా నా స్వార్థం కోసం రాసుకుంటున్నా, ఈ పుస్తకాలు చదవనివాళ్లలో కొంతమందికైనా వాటిని చదవాలనే ఆసక్తి పుట్టొచ్చని కూడా ఈ "మన తెలుగు" అనే ప్రయత్నం మొదలుపెట్టాను. వీలైనంత వరకూ తెలుగులో ఒకరితో మాట్లాడినట్లు రాద్దామని ఆశ. కానీ అక్కడక్కడా "దృక్పథం" లాంటిమాటలు రాశాను. అలాంటిమాటలు వినడానికి విచిత్రంగా ఉంటాయి. "నీ దృక్పథం మార్చుకో" అని ఎవరితోనన్నా అని చూడండి. కానీ చదువుతున్నప్పుడు పర్లేదేమో. ఇదిగాక, "కంటెక్స్ట్ స్విచ్ ఓవర్ హెడ్" వీలైనంత తగ్గిద్దామని ఇంగ్లీషు పదాలు తెలుగు లిపిలోనే రాశాను, అత్యవసరమైతే తప్ప.

If you don't see telugu characters above, please configure your system to display Unicode telugu. This wikipedia link may help.